మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు..
📌 మోదీ విదేశాంగ నీతిలో తప్పటడుగులు..
▪️ "మేము నిటారుగా నిల్చుంటాం. ఎవరిముందు తలవంచం. మా మిత్రులందరికీ స్నేహహస్తం అందుబాటులో ఉంటుంది. మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించం" 1982లో ఈ మాటలు పలికినవారు ఉక్కు మహిళగా పేరుపొందిన నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ను ఉద్దేశించి. సందర్భం ఏమిటంటే- భారత్ను అమెరికా శిబిరంలో చేరాలని ప్రెసిడెంట్ రీగన్ చేసిన ప్రతిపాదనకు శ్రీమతి ఇందిరాగాంధీ నిష్కర్షగా చెప్పిన సమాధానం అది. ఆమె ఈ మాటల్ని ఎక్కడో అనలేదు. అమెరికా పర్యటించినపుడు సాక్షాత్తు రోనాల్డ్ రీగన్ సమక్షంలోనే అమెరికా, రష్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తాము ఎవరి పక్షమూ వహించబోమని, దౌత్యపరంగా తమది తటస్థ వైఖరి అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.
▪️ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు మొదలుకొని, అటల్ బిహారీ వాజ్పేయి వరకు, మధ్యలో దేవెగౌడ, ఐకె గుజ్రాల్తోసహా దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ వారున్నా, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వారెవరున్నా.. భారత దేశ విదేశాంగ విధానం సుదృఢంగా అలీన విధానం (నాన్ అలైన్డ్)గానే కొనసాగింది. నిజానికి ఆనాటికి భారత్ నేటి మాదిరిగానే ప్రబల ఆర్ధిక శక్తిగా లేదు. పేదరికం, నిరుద్యోగం, అవిద్య వంటి ఎన్నో సామాజిక, ఆర్ధిక రుగ్మతలతో దేశం సతమతమవుతోంది. అయినప్పటికీ అన్న వస్త్రాల కోసమో, అణ్వాయుధాల కోసమో భారత్ ఎవరిముందూ తలవంచలేదు. దేశాన్ని ఎవరు ఏలుతున్నా.. వారు ఏకపక్షంగా తమకు తోచినట్టుగా నిర్ణయాలు తీసుకోలేదు. సొంత పార్టీ నేతలను, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను విశ్వాసంలోకి తీసుకొని అందరి సలహాలు, సూచనల మేరకు విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దారు. ప్రధానంగా దేశ ప్రయోజనాలు, మరీ ముఖ్యంగా ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాలకు దోహదం చేసే విదేశాంగ విధానాన్ని అనుసరించారు. కొన్ని సందర్భాలలో విదేశాంగనీతిలో రాజీపడవలసిన అనివార్యత ఏర్పడినా.. దేశ ప్రయోజనాల్ని ఎవరూ ఎన్నడూ పణంగా పెట్టలేదు. ఫలితంగానే నిన్నమొన్నటి వరకూ.. 'భారత్' కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా సమున్నత స్థాయికి తీసుకువెళ్ల గలిగారు.
▪️ అయితే, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష, డొల్ల విదేశాంగ విధానంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసక బారింది. దేశ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయి. భారతదేశం అనుసరించే విదేశాంగ విధానాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి (స్ట్రాటజిక్ అటానమీ)గా చెప్పుకొనేవారు. దానివల్లనే దక్షిణాసియా దేశాలకు భారత్ ప్రాంతీయ నాయకత్వం వహించే స్థితికి చేరింది. కానీ, నరేంద్రమోదీ హస్వదృష్టితో తీసుకొన్న పలు నిర్ణయాల కారణంగా నేడు భారత్ విదేశాంగ విధానంలో స్పష్టత లోపించింది. రాజకీయ ప్రత్యర్థి దేశాలకంటే వెనుకబడి పోయింది. పైగా, అంతర్జాతీయంగా అనేక అవకాశాలు కోల్పోయింది. చివరకు నేడు అనేక శిబిరాలుగా మారిన అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎవరిపక్షం వహిస్తున్నదో, ఎందుకు వహిస్తున్నదో, దానివల్ల సాధిస్తున్న ప్రయోజనాలేమిటో చెప్పలేని నిస్సహాయ పరిస్థితులు నెలకొన్నాయి.
▪️ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన తరచూ ఓ విలువైన మాట అంటుండేవారు. "మీకు ఎలాంటి స్నేహితులు ఉండాలో ఎంచుకొనే అవకాశం మీకు ఉంది. కానీ పొరుగున్న ఎవరుఉండాలో నిర్ణయించడం అన్నది మీ చేతుల్లో ఉండదు". ఆ కారణంగానే ఒక్క పాకిస్థాన్ మినహా మిగతా పొరుగు దేశాలతో వాణిజ్య, దౌత్య, సాంస్కృతికపరంగా చక్కటి సంబంధాలు నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 'నైబర్ హుడ్ ఫస్ట్ (పొరుగు వారే ముందు) అనే స్థాయిలో భారత్ తనకు మించిన స్థాయిలో నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, మాల్దీవులకు అన్ని రకాలుగా సాయం చేసింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లను దాదాపుగా ఒంటిచేత్తో పునర్నిర్మాణం చేసిందనే చెప్పాలి. ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనం నిర్మాణం మొదలుకొని రోడ్లు, బ్రిడ్జిలు, టెలిఫోన్ వ్యవస్థ వరకు అనేక రంగాలలో సాయం చేసింది. 1971-72లో తూర్పు పాకిస్థాన్ విముక్తమై బంగ్లాదేశ్ గా అవతరించడానికి పాకిస్థాన్తో యుద్ధమే చేసిన భారత్.. ఆనాడు బంగ్లాదేశ్ శరణార్ధులకు చోటిచ్చింది. వారి ఆకలి దప్పులు తీర్చడానికి దేశ ప్రజలపై అదనపు పన్నులు వేసింది. అదేవిధంగా.. శ్రీలంకలో వేర్పాటువాదాన్ని అణచడానికి భారత్ సైన్యాన్నే (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపికెఎఫ్) పంపింది. పొరుగు దేశాలైన మయన్మార్, మాల్దీవులకు సైతం సాయపడింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఇదొక నిరంతర ప్రక్రియలా కొనసాగింది.
▪️ కానీ.. నేటి పరిస్థితి ఏమిటి? 'నైబర్ హుడ్ ఫస్ట్' కాస్తా.. 'నైబర్ హుడ్ ఫర్గెట్' గా మారింది. భారత్ను ద్వేషించే దేశాలలో పాకిస్థాన్ సరసన బంగ్లాదేశ్ చేరిపోయింది. ఆ దేశంలో నేడు హిందువులపైన, హిందువుల ప్రార్ధనా మందిరాలపై దాడులు జరుగుతుంటే.. దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి వాటిని ఆపగలిగే శక్తి భారత్ కు లేకుండా పోయింది. బంగ్లాదేశ్ పూర్తిగా చైనా చెప్పుచేతుల్లోకి వెళ్లిపోయింది. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం.. బంగ్లాదేశ్లో లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మోంగ్లా ఓడరేవును, తీస్థానదీ ముఖద్వారాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవులతో సైతం భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏదో సామెత చెప్పినట్లు.. సొమ్మూపోయి శనిపట్టడానికి కారణం - మన దౌత్యనీతిలో వచ్చిన మార్పే! పొరుగు దేశాలతో పరస్పర సహకారం, గౌరవం ఇచ్చిపుచ్చుకొంటూ స్వప్రయోజనాలను కాపాడుకోవలసిన దౌత్య విధానంలో రాజకీయాలు జొరబడడం వల్ల.. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బంగ్లాదేశ్లో అవామీలీగ్ నేత శ్రీమతి షేక్ హసీనాతో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడం వల్ల అమెను వ్యతిరేకించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైనాకు దగ్గరయింది. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అధినేత తారిఖ్ రెహ్మన్ చైనాకు తమ దేశపు తలుపులు బార్లా తెరిచాడు. అమెరికా విషయంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ ఈ విధంగానే వ్యవహరించారు. ట్రంప్ను గెలిపించాలని ఆ దేశం వెళ్లి ఇండియన్ డయాస్పోరాకు పిలుపునిచ్చారు. పోనీ ట్రంప్ ఆ మేకు నరేంద్రమోదీ పట్ల, భారతపట్ల కృతజ్ఞత చూపించాడా అని అంటే సమాధానం లేదనే చెప్పాలి. భారత్పై ఏకపక్షంగా టారిఫ్లు భారీగా విధించాడు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై ఆంక్షలు విధించాడు. అలాగే ఇరాన్ నుంచి కూడా చమురు దిగుమతి చేసుకోరాదని అంతకుముందే హెచ్చరించాడు. అమెరికా విషయంలో నరేంద్రమోదీ తీసుకొన్న నిర్ణయాలు.. వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నట్లుగా తయారైయింది. పైగా, అమెరికా ఆంక్షలకు తలొగ్గిన ఫలితంగా.. భారత మార్కెట్లను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తబోతున్నాయి. దాంతో, భారత రైతాంగం పరిస్థితి ప్రశ్నార్ధకం కావడం ఖాయం. రెండేళ్ల క్రితం మొదలయిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి భారత్ తన విధానాన్ని స్పష్టం చేయలేకపోయింది. రష్యా దుందుడుకు తనాన్ని ప్రశ్నించలేకపోయాయి. దానివల్ల యూరోపిన్ యూనియన్ (ఇయు) స్నేహాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది.
▪️ ఇటీవల విశాఖలో జరిగిన నేవీ ఫీట్లో పాల్గొని స్వదేశానికి బయలుదేరిన ఇరాన్ ఓడను హిందూ మహాసముద్రంలో అత్యంత అమానుషంగా ముంచేసిన ఘటనపై భారత్ నోరు మొదపలేదు. తమ అతిధిని ఆ విధంగా చేయడమేమిటని అమెరికాను ప్రశ్నించలేదు. హిందూ మహాసముద్రంలో దొంగచాటుగా అమెరికా తన జలాంతర్గాములను మొహరిస్తే దానిని తప్పని ఖండించలేదు. ఇక, ఇరాన్ అధినేత ఖమేనీ హత్య జరిగిన 6 రోజుల అనంతరం భారత్ దౌత్యాధికారి ఒకరు ఢిల్లీలోని ఇరాన్ కాన్సులేటికి వెళ్లి మొక్కుబడి సంతాపం చెప్పొచ్చారు. దేశాధినేత ఈ సంఘటనపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ ఇరాన్ పట్ల వ్యతిరేకత ఉంటే అసలు ఇరాన్కు సంతాపం తెలపాల్సిన అవసరం లేదు. కానీ, ఈ అంశంలో జరిగిన తాత్సారానికి సమాధానం దొరకదు. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండి ఉంటే.. ఈ పాటికే వాటికి అమెరికాపై ప్రయోగించి ఉండేవారు. అంటే.. ఆయా దేశాలను నాశనం చేయడానికి అమెరికా బూచిగా చూపించే అంశం అణ్వాయుధాలు కలిగి ఉండడం. దీనిని కూడా ఇండియా ప్రశ్నించలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇరాన్తో యుద్ధానికి సిద్ధపడిన ఇజ్రాయెల్ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడమే ఆశ్చర్యం. ఇజ్రాయెల్ పర్యటించిన ఏకకైక ప్రధాని ఇప్పటివరకు ఒక్క మోదీయే. పైగా, ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీ.. పాలస్తీనాతో జరిపిన యుద్ధంలో చనిపోయిన 1,219 ఇజ్రాయెలీలకు సంతాపం వ్యక్తం చేశారేతప్ప ఆ యుద్దంలో ఇప్పటివరకు అసువులు బాసిన 70 వేల మంది పాలస్తీనీయుల పట్ల ఒక చుక్క కన్నీరు కూడా కార్చలేకపోయారు.
▪️ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నది ఓ నానుడి. కానీ, నేడు దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో తాము సాధించిన విజయాలు.. వివిధ రాష్ట్రాలలో అధికారంలోకి రావడం, జీఎస్టీని సరళీకృతం చేయడం, లేబర్ కోడ్ చట్టాలు మార్చడం మొదలైన వాటిని ఘనంగా చాటుకుంటోంది తప్ప.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట గురించి మాట్లాడటం లేదు. ముఖ్యంగా.. నరేంద్రమోదీకి ఆప్తమిత్రుడైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం గురించి అధికార పార్టీకి చెందినవారెవరూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. ప్రస్థుతం ఇరాన్పై సాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న మౌనం దేనికి సంకేతం?! విదేశీ విధానంలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు, తప్పుడు అడుగులకు దేశం చెల్లించే మూల్యం ఏ మేరకు ఉంటుందో ఊహించడం కష్టం.
Telugu Desam Party (TDP) Bharatiya Janata Party (BJP) Nara Chandrababu Naidu Nara Lokesh Narendra Modi Donald J. Trump PMO India
#IranWar #Khamenei #Trump #modi #america #worldwar3
#mlcramachandraiah #TDPSOCIALMEDIAFORTDP
Comments
Post a Comment